పన్నెండవ శతాబ్దంలో పల్నాడు (ఉత్తర గుంటూరు జిల్లా) లోని మాచెర్ల మరియు గురజాల కు చెందిన దాయాదుల మధ్య వైష్ణవ-శైవ మత వైషమ్యాలు, రాజ్య కాంక్షల విభేదాలతో రగుల్కొన్న విరోధాల ప్రతిఫలం కారంపూడి రణభూమిగా జరిగిన పోరు "పల్నాటి యుద్ధం" గా తెలుగు చరిత్రలో ప్రసిద్ధం. సారూప్యంలో ఇదొక ఆంధ్ర కురుక్షేత్రం. గురజాల రాజు నలగామరాజు. ఇతని కొలువులోని సలహాదారుగా వున్న నాయకురాలు నాగమ్మ రాజనీతెరిగిన ప్రతిభాశాలి మరియు శివభక్తురాలు. నలగామరాజు సోదరుడు మలిదేవుడు మాచెర్ల రాజు. మలిదేవుని కొలువులో మంత్రి అయిన బ్రహ్మనాయుడు విష్ణుభక్తుడు. యితడు మాచెర్లలో చెన్నకేశవస్వామి ఆలయం కట్టించాడు. పరమతసహనం గలవాడై అన్నికులాలవారు సహపంక్తిని భోజనం చేయాలన్న "చాపకూటి సిద్ధాంతం" ప్రతిపాదించిన సామ్యవాది. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించి మాలదాసరులను చెన్నకేశవ స్వామి కోవెలకు అర్చకులుగా నియమిస్తాడు. ఈ చర్య మత విద్వేషాలను ఎక్కువ చేస్తుంది.
ఈ జరిగిన చరిత్ర ఇతివృత్తంతో "పల్నాటి యుద్ధం" పేరుతో 1947 లోను, 1966 లోను చలన చిత్రాలు వచ్చాయి. 1947 లో వచ్చిన చిత్రంలో గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, ఎ.ఎన్.ఆర్.లు, వరుసగా బ్రహ్మనాయుడు, నాగమ్మ, బాలచంద్రుడు (బ్రహ్మనాయుని కొడుకు) ల పాత్రలు పోషించారు.
| చిత్రం# | విడుదల | నిర్మాణం | చిత్రం | సంగీతం | నిర్మాత | దర్శకుడు |
|---|---|---|---|---|---|---|
| 5 | 24.09.1947 | శారదా ప్రొడక్షన్స్ | పల్నాటి యుద్ధం | గాలిపెంచెల | కోగంటి వెంకట సుబ్బారావు | గూడవల్లి రామబ్రహ్మం, ఎల్.వి.ప్రసాద్ |
ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు రెండు బృంద గీతలను, ఒక ఏకగళగీతాన్ని, ఒక యుగళగీతం పి.కన్నాంబతో పాడారు. మాస్టారు తెలుగు చలన చిత్ర రంగంలో కన్నాంబతో పాడిన ఒకే ఒక యుగళగీతమిది. అంతే కాక మాస్టారు తెలుగు సినిమాలలో పాడిన మొదటి భక్తిగీతమిది.
| చిత్రం# | # | పాట/పద్యం/శ్లోకం | తీరు | రచన | పాడినవారు | అభినయం |
|---|---|---|---|---|---|---|
| 5 | 1 | చూతము రారయ్యా | (బృం) | సముద్రాల సీ. | ఘంటసాల, అక్కినేని, సుందరమ్మ, ప్రయాగ, బృందం | అక్కినేని, వి.కోటేశ్వరరావు, తదితరులు |
| 5 | 2 | మేత దావని | (బృం) | సముద్రాల సీ. | ఘంటసాల, బృందం | అక్కినేని, వి.కోటేశ్వరరావు, తదితరులు |
| 5 | 3 | తీరిపోయెనా మాతా | (ఏ) | సముద్రాల సీ. | ఘంటసాల | నేపథ్యగానం |
| 5 | 4 | తెర తీయగ రాదా | (యు) | సముద్రాల సీ. | ఘంటసాల, కన్నాంబ | గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ |
బృం - బృందగీతం; ఏ - ఏకగళగీతం; యు - యుగళగీతం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి